దేశంలో ఉద్యాన పంటలకు ప్రపంచ విపణిలో పోటీ పెంచేందుకు కేంద్రం (Central government) విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఉద్యాన సామూహిక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేసింది. 11 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో 7 రకాల పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, విదేశీ ఎగుమతులు పెంచనుంది. మొత్తం 53 ఉద్యాన క్లస్టర్లలో చేపట్టనున్న కేంద్రం... తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద 12 క్టస్టర్లలో అమలు చేయనుంది.
రెండు జిల్లాలు...
ఇందులో భాగంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలను ఎంపిక చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మామిడి 57 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా... అనంతపురం జిల్లాలో 22 వేల 215 ఎకరాల్లో అరటి పండిస్తున్నారు. ఆయా పంటల అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులివ్వగా... మన రాష్ట్రానికి రూ. 100 కోట్లు కేటాయించింది.
దేశంలో మామిడి, అరటి, ద్రాక్ష, పైనాపిల్, దానిమ్మ, పసుపు, యాపిల్ ఉత్పత్తి, ఎగుమతులు 25 శాతం పెంచాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ ఏడు రకాల పంటల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించి... ఆ ఉత్పత్తులకు మంచి ధర, మార్కెటింగ్, దేశ, విదేశాలకు ఎగుమతుల కోసం వసతులు కల్పించనుంది. అందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 10 వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
నోడల్ ఏజెన్సీగా...
తెలంగాణలో ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీ (Nodal agency) గా రాష్ట్ర ఉద్యాన సంస్థ వ్యవహరిస్తుంది. 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా... ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56,855 ఎకరాల్లో పంట చేస్తున్న 17,284 మంది రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మార్కెటింగ్ కోసం 10 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయనుంది. గద్వాల జిల్లాలో 49 వేల టన్నుల నిల్వ సామర్థ్యం గల 7 శీతల గిడ్డంగులు, మహబూబ్‌నగర్‌లో మూడు 15 వేల టన్నుల గిడ్డంగులు, నాగర్‌కర్నూల్‌లో 5 వేల టన్నుల సామర్థ్యం గల ఒక శీతల గిడ్డంగి నిర్మిస్తారు. మామిడి పండ్ల శుద్ధి, ప్యాకింగ్, ప్యాక్ హౌజ్‌ల్లో శీతల గదులు ఏర్పాటు చేస్తారని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి.
సాగు నుంచి దేశ, విదేశీ మార్కెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించనుంది. ఫలితంగా రైతుల ఆదాయంతోపాటు తెలంగాణ బ్రాండ్ మరింత ఖ్యాతి సంపాదించనుంది.