తెలంగాణ జిల్లాల్లోనూ లాక్‌డౌన్, కర్ఫ్యూ సంపూర్ణంగా అమలవుతోంది. నిబంధనలు పాటించని వాహనాదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పలుచోట్ల ప్రజలకు కరోనా వల్ల వచ్చే ముప్పును అధికారులు వివరిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలకు పలువురు దాతలు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసి అండగా నిలుస్తున్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై నిర్మల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించి ఇద్దరు ప్రయాణించిన ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 15 ఆటోలు, 60 బైకులను సీజ్ చేశారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్‌పూర్ మహారాష్ట్ర సరిహద్దు వద్ద మన రాష్ట్రం నుంచి వెళ్లే వాహనాలను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న ఉన్నతాధికారులు నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలను అనుమతించాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. నిత్యావసరాల ధరలు పెంచి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలపై కరీంనగర్ జిల్లా రామడుగులో అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు.
ఖమ్మం జిల్లా ఇల్లందులో పారిశుద్ధ్య పనుల పట్ల అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ ఎం.వి.రెడ్డి కరోనా దృష్ట్యా వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటీ నమోదు కాలేదని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. వైరా నియోజకవర్గంలో ప్రజలంతా లాక్‌డౌన్‌ను స్వచ్చందంగా పాటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో చాలా గ్రామాల్లో కంచెలను తొలగించారు. భద్రాచలంలో పలు ఔషధ దుకాణాలపై దాడులు చేసిన అధికారులు శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న యజమానులపై జరిమానా విధించారు. ఖమ్మం 33వ డివిజన్‌లో ఉచిత కూరగాయల పంపిణీకి ప్రజలంతా గుంపులుగుంపులుగా తరలివచ్చారు. కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. యాదగిరిగుట్టలో టాక్సీ డ్రైవర్లు, కొంతమంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. మహబూబాబాద్‌లో సామాజిక సేవకుడు సుబాని కరోనా భూతం వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా దృష్ట్యా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రచారం చేశారు.
వలస కూలీలకు లాక్‌డౌన్ సాయంగా రేషన్ బియ్యం 500 రూపాయల నగదును సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో అందించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరంగల్‌లో దిల్లీ, రాజస్థాన్ నుంచి వచ్చిన కుటుంబాలకు ఉచిత భోజనం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అందజేశారు. రెండురోజుల్లో నిత్యావసరాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దు వద్ద పడిగాపులు కాస్తున్న 142 మంది కూలీలను మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలకు అధికారులు తరలించి భోజన వసతి కల్పించారు. మెదక్ జిల్లా చేగుంట జాతీయరహదారి వద్ద వలస కూలీలు, కార్మికులకు స్థానిక తెరాస నాయకులు ఉచితంగా భోజనం సమకూర్చారు. ఖమ్మంలో పలు స్వచ్చంద సంస్థలు కూలీలకు అన్నదానం చేశారు. వరంగల్‌లో సామాజిక దృక్పథంతో పనిచేస్తున్న పాత్రికేయులకు ధరణి సేవా స్వచ్ఛంద సంస్థ మాస్కులతో పాటు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.