విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బోడి కొండ దిగువన 277 ఎకరాల మెట్ట, 450 ఎకరాల పల్లం భూములున్నాయి. వర్షకాలంలో ఈ కొండపై పడే వర్షంతోనే చుట్టుపక్కల చెరువులు నిండుతాయి. ఆ నీటితోనే వందల ఎకరాలు పొలాలు సాగుతున్నాయి. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు ఈ కొండే ప్రధాన జీవనాధారం.దీనిపై వెలసిన బోడమ్మ దేవత..స్థానిక ప్రజలకు ఆరాధ్య దైవం. ఏటా ఖరీఫ్ వరినాట్లు పూర్తైన తర్వాత రైతులు వరదపాశం పోయడం ఇక్కడ ఆనవాయితీ. కార్తికమాసంలో ఈ కొండపై పెద్దఎత్తున సంబరాలు జరుపుకుంటారు.
ఈ కొండ కింద గ్రానైట్ ఉందని సర్వేలో తేలింది. 2010 నుంచే దీని తవ్వకాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇక్కడ క్వారీ నిర్వహణ కోసం అనుమతులు కావాలని 2010 ఏప్రిల్ 24న ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేశారు. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అధికారుల వద్ద తమ ఆందోళన వ్యక్తం చేశారు. బోడికొండ వద్ద గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని కోరారు. కొన్నేళ్లపాటు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆతర్వాత 2016లో క్వారీ అనుమతులకు మరోసారి ప్రయత్నించారు. 2019 నుంచి ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేశారు. గతేడాది డిసెంబరు 15న గ్రానైట్ తవ్వకాలకు గనులశాఖ జిల్లా ఏడీ ఆదేశాలు ఇచ్చారు. లీజుదారులు తవ్వకాలకు పనులు చక్కబెడుతున్నారు. ఏ ప్రాంతంలోనైనా ఓ ప్రాజెక్టు నిర్మించాలంటే... గ్రామ పంచాయతీ తీర్మానం తప్పనిసరి. కానీ ఇక్కడ అటువంటి కార్యక్రమం అధికార యంత్రాంగం చేపట్టకపోవటంపై స్థానికులు మండిపడుతున్నారు.
బోడికొండ వద్ద గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేయాలని..రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొండిగా ముందుకెళ్తే ప్రాణాలు అడ్డుపెట్టయినా కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ గ్రానైట్ తవ్వకాలపై గతంలో అటవీ శాఖ కూడా అభ్యంతరం చెప్పింది.
ఇదీ చదవండి