న్యాయవ్యవస్థను భయపెట్టి అనుచిత ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఈ నెల 6న చేసిన ఫిర్యాదును తిరస్కరించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఆంధ్రప్రదేశ్ యూనిట్) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ సీజేకు సోమవారం లేఖ రాశారు. 31 కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్‌పై బయట తిరుగుతున్న వ్యక్తి అదే వ్యవస్థపై యుద్ధం ప్రకటించడం దారుణమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనాలోచిత, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్నందునే ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయన మద్దతుదారులు న్యాయస్థానంపై నిరంతర దాడి మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయం అందించే ఏకైక వ్యవస్థగా హైకోర్టు ఒక్కటే మిగిలిందని, అది సహించలేకే ప్రభుత్వం దానిపై యుద్ధానికి దిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపైనా, రాష్ట్రంలోని న్యాయవ్యవస్థపైనా అభ్యంతర ఆరోపణలు గుప్పించారు. గతేడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా తయారయ్యాయి. అవి కోర్టుల్లో అగ్నిపరీక్షలకు నిలబడలేకపోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రి, మంత్రులు సహా రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులపై నోరు పారేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దాన్నిబట్టి జగన్ నిర్ణయాలు అనాలోచితంగా, అసంబద్ధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.
- మీ నుంచి సానుభూతి పొందాలనే లేఖ
జగన్ రాసిన లేఖలో వీసమెత్తు నిజం కూడా లేదు. అందుకే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మీ (సీజే) నుంచి సానుభూతి పొందాలనే ఆ లేఖ రాశారు. అబద్ధాలతో కూడిన ఆ లేఖను సీఎం తన సొంత ఛానల్ సాక్షి ద్వారా బహిర్గతపరచడం అధికార రహస్యాలను కాపాడతానని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే కాకుండా, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడమే అవుతుంది. హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను, సెప్టెంబర్ 16న జస్టిస్ సోమయాజులు ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీలు వేసింది. అవి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున స్వీయసమన్వయం పాటించాలి. జగన్ మీకు చేసిన ఫిర్యాదులో వాటిని పునరుద్ఘాటించేందుకు ప్రయత్నించడం విస్మయం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్ సహా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడం పూర్తిగా కోర్టు ధిక్కారమే. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. జగన్‌పై 31 కేసుల్లో క్రిమినల్ విచారణ నడుస్తోంది. అలాంటి వ్యక్తికి న్యాయవ్యవస్థపై దుర్మార్గపు ఆరోపణలు చేసే అర్హత లేదు. జస్టిస్ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా, న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా అడ్డుకోవాలనే జగన్ మీకు లేఖ రాశారు. ఈ ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్ ఫిర్యాదును తిరస్కరించి, న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి లేఖలో అజయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: