KRMB committee Meeting postponed : తెలుగురాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతో పాటు జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్ వరద జలాల అంశాలపై చర్చించేందుకు కేఆర్ఎమ్బీ కమిటీలు నేడు నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. ఏపీ ఈఎన్సీ విజ్ఞప్తి మేరకు సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు వర్గాలు సమాచారమిచ్చాయి. 2022-23 నీటి సంవత్సరంలో సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకుగాను బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, త్రిసభ్యకమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంది కానీ ఇంతలోనే సమావేశం వాయిదా వేస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ తో పాటు వరద నీటి వినియోగం, సంబంధిత అంశాలపై కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షక కమిటీ సైతం ఇవాళ సమావేశం కావలసింది.
మూడు అంశాలకు సంబంధించిన సిఫారసులతో రూపొందించిన నివేదికపై ఆర్‌ఎంసీ సమావేశంలో చర్చించాలి. నివేదికను పరిశీలించి సంతకాలు చేసేందుకు ఆర్ఎంసీని సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశం వాయిదా పడడంతో సెప్టెంబర్ రెండో తేదీన తదుపరి సమావేశాలు నిర్వహించనున్నట్లు కృష్ణా బోర్డు తెలిపింది.
ఇవీ చదవండి: