ఖరీఫ్ ఆరంభంలో రాయలసీమలో వర్షాలు అధికంగా కురిశాయి. అనంతపురంలో 90, చిత్తూరులో 68.3, కర్నూలు జిల్లాలో 56.2 మి.మీ. చొప్పున సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం వానలు కాస్త నెమ్మదించాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణం కంటే కాస్త తక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో సాధారణ వర్షం కురవగా.. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కాస్త పెరిగింది.
అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా జూన్‌లో సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ సూచించింది. దీనికి అనుగుణంగానే నాలుగైదు రోజులుగా వానలు నెమ్మదించాయి. రాయలసీమలో అక్కడక్కడా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ సాగు మొదలైంది. కోస్తా ప్రాంతంలోనూ పొలాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. రైతులు గట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి
పత్తి సాగు ఈ ఏడాది తగ్గనుంది. కొన్నేళ్లుగా గులాబీ పురుగు ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. దిగుబడులు తగ్గడంతో పాటు పుచ్చు ఎక్కువగా వచ్చి నాణ్యత లోపిస్తూ ధరలూ లభించడం లేదు. మరోవైపు వానలు కురవడంతో పూత, పిందె రాలిపోవడం, పత్తి కాయలు కుళ్లిపోవడంతో నష్టాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాలో పత్తికి బదులు కంది, రాయలసీమలో ఆముదం సాగు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. మిర్చి ధరలు బాగుండటంతో కొందరు రైతులు అటువైపు దృష్టి సారించారు.
వ్యవసాయశాఖ లెక్క ఇదీ..
ఖరీఫ్‌లో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరగనుంది. వాణిజ్య పంటల్లో పత్తి సాగు తగ్గనుండగా.. మిర్చి విస్తీర్ణం కొంతమేర అధికం కానుంది. చిరు ధాన్యాలకు ప్రోత్సాహం కల్పించనున్నారు. ఖరీఫ్ 2021లో మొత్తం 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయనే అంచనాతో వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. గతేడాదితో పోలిస్తే 64వేల ఎకరాల సాగు పెరుగుతుందని అంచనా వేసింది. 94 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 8.34 లక్షల నూనెగింజల ఉత్పత్తి వస్తుందని ఆశిస్తోంది. 8.97 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. 2020 ఖరీఫ్‌తో పోలిస్తే.. పత్తి సాగు 25వేల ఎకరాలు తగ్గనుండగా, మిర్చి విస్తీర్ణం 17వేల ఎకరాల వరకు పెరగొచ్చని వివరించింది.
సాగు పద్ధతులు మారాలి
వ్యవసాయంలో విత్తన శుద్ధి, చదరపు మీటరుకు ఉండాల్సిన మొక్కల సాంద్రత, వాడాల్సిన ఎరువుల పరిమాణం, నీటి యాజమాన్యం, వేరుసెనగలో జిప్సం వాడకం, వరిలో కాలిబాటల ఏర్పాటు, తదితర అంశాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. రైతులు ఆచరించాల్సిన ఈ తరహా పద్ధతులను గుర్తించి.. అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ప్రతి నెలా ఎంపిక చేసిన అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి రైతు భరోసా కేంద్రాల సిబ్బంది కేంద్రీకృత సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దీనితోపాటు విషయ పరిజ్ఞానంపై కరపత్రాలు, గోడపత్రికలు, వార్తాపత్రికలు, రైతు భరోసా ఛానల్ ద్వారా ప్రచారం చేస్తాం. - అరుణ్ కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
ఇవీ చదవండి: