Government employees federation: వారంలోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి (Government employees federation president venkatramreddy) ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు కోరే అవకాశం ఉందన్నారు. 40 శాతం వరకు ఫిట్మెంట్ కోరాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 నుంచి క్యాష్ రూపంలో ఎరియర్స్ ఇవ్వాలని కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2022 జనవరి నుంచి జీతంతో పాటు ఎరియర్స్ చెల్లించాలని ఒత్తిడి తెస్తామన్నారు. విశ్వ విద్యాలయాలు, మోడల్ స్కూళ్ళు, ఇతర కార్పొరేషన్లకు చెందిన ఉద్యోగులకు అలాగే చెల్లించాలని కోరతామన్నారు. హెచ్ఆర్ఏను ఏమాత్రం తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని సర్కారును కోరుతున్నట్లు తెలిపారు.
కేంద్రం మాదిరిగానే.. చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం వద్ద ప్రతిపాదన పెడతామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమానవేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాలని 92 సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీపీఎస్ విషయంలోనూ త్వరలోనే తేల్చాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. కింది స్థాయిలో కలెక్టర్లు ఆదేశాలు పాటించటం లేదన్నారు. డిసెంబర్ 21 తేదీన సీఎం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ వార్డు సచివాలయాల ఆవిర్భావ దినంగా నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 10లోగా ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వస్తుందన్నారు. అలా రాకపోతే తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటామని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రజల సీజన్ ముగిసిందని ఏపీ జీఈఏ కార్యదర్శి అరవపాల్ అన్నారు. ఇక నుంచి ఉద్యోగుల సీజన్ మొదలు అవుతుందన్నారు. ఉద్యోగుల డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.