జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఈ ఏడాది 4 విడతల్లో నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. తొలి విడత పరీక్ష మంగళవారం నుంచి ఈనెల 26 వరకు జరగనుంది. మంగళవారం బీఆర్క్, బి-ప్లానింగ్ ప్రవేశాల కోసం పేపర్-2 నిర్వహించనున్నారు. బీటెక్ ప్రవేశాల కోసం బుధవారం నుంచి ఈనెల 26 వరకు ఉంటుంది.
అరగంటే ముందే...
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో కేంద్రాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో జేఈఈ మెయిన్ కేంద్రాలను సిద్ధం చేశారు. జేఈఈ మెయిన్ రోజుకు రెండు పూటలు ఆన్ లైన్‌లో జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలో ఉండాలని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమకు కరోనా లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
మంగళవారం నుంచి జరగనున్న తొలి విడత జేఈఈ మెయిన్ రాసేందుకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది దరఖాస్తు చేశారు. మొదటి విడత పరీక్ష కోసం దేశంలోనే అత్యధికంగా ఏపీ నుంచి 87,797, ఆ తర్వాత తెలంగాణ నుంచి 73,782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడత కాబట్టి కొంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటిసారి తెలుగుతో పాటు 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్నారు. ఆంగ్లం కాకుండా ఇతర భాషల్లో రాసేందుకు నాలుగు విడతలకు కలిపి 1,49,621 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది.
తెలుగులో రాసేందుకు నాలుగు విడతలకు ఇప్పటి వరకు 371 దరఖాస్తులు అందాయి. కరోనా పరిస్థితులు, సీబీఎస్సీఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు సిలబస్ తగ్గించినందున ఈ ఏడాది జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలో పలు మార్పులు చేశారు. ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వనున్నారు. బీటెక్ కోసం నిర్వహించే పేపర్-1లో 90 ప్రశ్నలు ఇస్తారు. అందులో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. పేపర్-2-ఏలో ఛాయిస్ ప్రశ్నలతో కలిసి 82, పేపర్-2-బీలో 105 ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మిగతా మూడు విడతల పరీక్షలు జరగనున్నాయి. నాలుగింటిలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.