అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈనెల 4న దీక్ష: జేసీ దివాకర్ రెడ్డి - జేసీ దివాకర్ రెడ్డి నిరసన దీక్ష
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కేసులను బయటికు తీస్తూ... తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 4న దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అమరావతి విషయంపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
తనతో పాటు కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన... అక్రమ కేసులపై ప్రభుత్వ తీరును నిలదీస్తూ ఈ నెల 4వ తేదీన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కేసులను ఎత్తివేసే వరకు ప్రభుత్వంతో పోరాడతానని స్పష్టం చేశారు.
రెండేళ్ల కింద పెట్టిన కేసుల్లో చార్జిషీట్ వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తనతో పాటు కుటుంబాన్ని వేధిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్ష చేపడతాను. అమరావతి విషయంలో ప్రధాని ఎందుకు స్పందించటం లేదు..? ప్రధాని దేశాన్ని పాలిస్తున్నారు కదా..? విశాఖలో రాజధాని పెట్టడంపై సీమ వాసులు ఒక్కరైనా హర్షిస్తున్నారా..? రాజధాని విషయం కేవలం తుళ్లూరు ప్రాంత ప్రజలది కాదు..ఐదు కోట్ల ఆంధ్రులది - జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ
అన్ని పార్టీల నేతలు అమరావతి ఉద్యమంలో భాగం కావాలని జేసీ పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులతో కలిసి సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై స్పందించిన కేంద్రం... అమరావతి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజధాని అంశంపై కేంద్రం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి