వైకాపా ఏడాది పాలన తప్పటడుగులు, కోర్టు మొట్టికాయలతో సాగిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. విజయవాడలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. వైకాపా ఏడాది పాలనపై విమర్శలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి...సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు.
నాలుగు విడతల్లో ఉచిత రేషన్ ఇచ్చి, నాలుగురెట్లు అధికంగా కరెంట్ బిల్లులు వేశారని ఆరోపించారు. ఒక్క ఏడాదిలో 80 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయని ఆక్షేపించారు.
సీఎం జగన్ విద్వేషపూరిత రాజకీయాలు మానుకుని, ఆదాయ వనరులు పెంచడం, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. 2024లో భాజపా, జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మహేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : రైతుల నుంచి 30 శాతం పంట కొనుగోలు: సీఎం జగన్