నేడు జగనన్న వసతి దీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కంప్యూటర్‌లో బటన్ నొక్కి దాదాపు 11 లక్షలకుపైగా విద్యార్ధుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద 2020–21 సంవత్సరానికి 11,92,834 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 1,147.41 కోట్లు జమ కానున్నాయి. గత వారం జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ 671.45 కోట్లు మొదటి త్రైమాసికానికి వారి తల్లులకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇవాళ వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను మరో 1,147.41 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి 20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న వసతి దీవెన పథకం కింద ఇప్పటికే 1,220.99 కోట్లు చెల్లించామని, ఇప్పుడు మొదటి విడతగా 1,147.41 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇప్పటివరకు వసతిదీవెన కింద 2,368.40 కోట్లు చెల్లించినట్లు అవుతుందని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు 'ఈటీవీ బాలభారత్' అంకితం: రామోజీరావు