అమరావతి కోసం 2 వేల రోజులైనా పోరాడతామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 2 వందల నగరాల నుంచి ప్రవాసాంధ్రుల నుంచి వెల్లువెత్తుతున్న మద్దతు ఉద్యమ బలానికి నిదర్శనమన్నారు. అమరావతి ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా విజయవాడ ఆటోనగర్‌లోని ఐకాస కార్యాలయం వద్ద రైతులు, ఐకాస నేతలు, మహిళలు దీక్ష చేశారు. రాజధాని కోసం ప్రాణాలర్పించిన రైతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత బాబూరావు, భాజపా నేత వెలగపూడి గోపాలకృష్ణ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
ముఖ్యమంత్రి జగన్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఐకాస నేతలు, రాజకీయ నాయకులు విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు బయటకు వెళ్లిపోతున్నాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి కానీ.. వికేంద్రీకరణ పేరుతో మోసం చేయవద్దని హితవు పలికారు. అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తోన్న రైతులు, మహిళలను జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించారని.. నేతలు ఆరోపించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మోదీ స్పందించాలి
దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన ప్రధాని మోదీ అమరావతి విషయంలో స్పందించాలని పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి డిమాండ్ చేశారు. 200 రోజులుగా అలుపెరుగని చేస్తున్న రైతులకు సంఘీభావంగా గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. సీఎం జగన్.. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకారం తెలిపి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి..