ఈనెల 6న హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ సోదాల(IT Raids on Hetero Drugs) సమయంలో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతగా నగదును, బంగారాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందన్న కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందం ద్వారా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హెటిరో డ్రగ్స్(hetero drugs) సంస్థలపై సోదాలు చేసిన సమయంలో పెద్ద మొత్తంలో రూ.142.87 కోట్లు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడున్నర కిలోలకుపైగా బంగారం బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో లాకర్లు ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు.. 16 మాత్రమే తెరచినట్లు అధికారికంగా వెల్లడించారు.
ఐటీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు 40 లాకర్ల వరకు ఉండగా.. 16లాకర్లు తెరిస్తేనే ఇంత పెద్ద మొత్తంలో నగదు బంగారం దొరికిందని మిగిలినవి తెరిస్తే ఇంకెంత నగదు, బంగారం బయటపడుతుందో చెప్పలేని పరిస్థితులు ఐటీ వర్గాల్లో నెలకొన్నాయి. లాకర్లలో నగదు, బంగారం దాచిన విధానాన్ని చూసి ఐటీ అధికారులే విస్తుపోయారు. అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు సంస్థ లాకర్లల్లో ఈ సొమ్మును దాచినట్లు గుర్తించి సోదాలు(IT Raids on Hetero Drugs) నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో దానిని లెక్క పెట్టేందుకు ఎస్బీఐ అధికారుల సహకారం తీసుకున్నారు. డబ్బు లెక్క పెట్టే యంత్రాలతో వచ్చిన మూడు బృందాలు దాదాపు రెండురోజులపాటు శ్రమించాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే లాకర్లకు చెందిన తాళాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని కూడా తెరిచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.1,438.08 కోట్లు విడుదల