దేశ రాజకీయాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా సమాలోచనలు చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ ముగిసిన అనంతరం.. ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు.
అవగాహనతో ముందుకు నడవాలి..
తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కి.మీ. మేర ఉమ్మడి సరిహద్దు ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని కేసీఆర్ ఉద్ఘాటించారు.
ఠాక్రేకు ఆహ్వానం..
కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు. కేంద్ర సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. వైఖరి మార్చుకోకుంటే భాజపాకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. కార్యాచరణ, చర్చలు ఇవాళే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు.
ఇది ఆరంభం మాత్రమే..
జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరింత పురోగతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చర్చల్లో రహస్యమేమీ ఉండదని.. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని స్పష్టం చేశారు ఉద్ధవ్. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయ నడుస్తోందన్న మహారాష్ట్ర సీఎం.. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచిది కాదని హితవు పలికారు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ముంబయిలో ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ