విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన వెండి రథానికి అమర్చిన వెండి సింహాలు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. దీనిపై విచారణకు దేవదాయ శాఖ తరఫున విచారణ ప్రారంభించారు. ఈనెల 13న రథాన్ని పరిశీలిస్తుండగా వెండి తాపడం చేసిన నాలుగు సింహాల విగ్రహాలలో మూడు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే... ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
దేవస్థానం వెండితోపాటు దుర్గా ఇండస్ట్రీ అధినేత రమణ ఇచ్చిన కానుకలతో 2002లో వెండి రథాన్ని రూపొందించారు. ఒక్కో విగ్రహానికి 10 కిలోల వెండి తాపడం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం చోరీకి గురైన వాటి విలువ రూ.18 లక్షల వరకు ఉంటుందని అంచనా. మార్చిలో విధించిన లాక్‌డౌన్ సమయంలోనే చోరీ జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వెండి సింహాల విగ్రహాల అదృశ్యంపై సమగ్ర విచారణ చేయించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవో, ఆర్‌జేసీ ఎన్.వి.ఎస్.మూర్తి బుధవారం విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: