High court Hearing on social Media case : జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల కేసులో ఆరుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. పత్రికల్లో రాయలేని భాషతో వారు పెట్టిన పోస్టులను తన ఉత్తర్వుల్లో సవివరంగా ప్రస్తావించింది. బెయిలు మంజూరు విషయంలో నేర తీవ్రత, నిందితుల పాత్ర , కేసులోని పూర్వాపరాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం తమపై ఉందని తెలిపింది. ఆరోపణల తీవ్రత, మరికొందరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం, దర్యాప్తు ఇంకా తుదిదశకు చేరుకోలేదని సీబీఐ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ నవంబర్ 30 న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ కేసులకు సంబంధించిన వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. జడ్జిలపై ఆరోపణలు చేయడం, కోర్టులను అపకీర్తి పాల్జేయడమేనని న్యాయమూర్తి అన్నారు. అక్టోబర్ 2020లో కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ చేసినా వారిని పట్టుకునేందుకు ఏడాది పట్టిందంటే పిటిషనర్లు చిన్నవారు అయినా ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టులు చూస్తుంటేన్యాయవ్యవస్థపై కుట్ర పన్నినట్లు భావించాల్సి వస్తోందన్నారు. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు 2020 ఏప్రిల్ నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే పోస్టులు వ్యక్తిగతం కావని న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉందన్నారు. బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేశారు.
ఇవీచదవండి.