దేశవ్యాప్తంగా ఎన్‌ఎంపీ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ, విలువైన ఆస్తులను నగదుగా మార్చే ప్రక్రియ చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఏయే ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉందనే దానిపై దృష్టి సారించాలని నీతి ఆయోగ్ కోరింది. ఇది అమలు చేయటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొంది. దీనికోసం 2021 మార్చి 9న ’ఆస్తుల అభివృద్ధి, పెట్టుబడుల ఉపసంహరణ’ అనే అంశంపై నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో కొన్ని..
* రాష్ట్ర రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే, ట్రాన్స్‌మిషన్ టవర్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, మైనర్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, జల రవాణా, జెట్టీలు, మల్టీ మోడల్ టెర్మినళ్లు, లాజిస్టిక్ పార్కులు, బస్ టెర్మినళ్లు, క్రీడా మైదానాలు, గోదాముల అద్దెల ద్వారా ఆదాయాన్ని సమకూర్చే ఆస్తులను పెట్టుబడుల ఉపసంహరణ కోసం గుర్తించాలి
* నిరుపయోగంగా ఉన్న ఆస్తులను అంచనా వేసి వాటిని నగదుగా మార్చుకునే అవకాశాలను రాష్ట్రాలు గుర్తించాలి
* ప్రైవేటీకరణ, మూసివేత, వివిధ సంస్థల విలీనం వంటి నిర్ణయాల ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ
* పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి
* ఆక్రమణల తొలగింపు, అవసరానికి అనుగుణంగా భూముల వినియోగం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌వోసీ) జారీకి సమన్వయం వంటి అంశాలను సదస్సులో కేంద్రం కీలకంగా గుర్తించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!