Rains in AP: బంగాళాఖాతంలోని దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని తదుపరి 24 గంటల్లో తుపానుగానూ మారే అవకాశముందని స్ఫష్టం చేసింది. డిసెంబర్ 3 నాటికి ఇది తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతానికి దగ్గరగా వస్తుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
heavy rains: డిసెంబరు 3 నుంచి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు అల్పపీడనం తుపానుగా బలపడిన అనంతరం డిసెంబరు 3 నుంచి 5 వరకూ కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణశాఖ తెలియజేసింది. కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచనలు జారీ చేసింది.
ఇదీచదవండి: ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్