ఎస్ఈసీ తనపై చర్యలు తీసుకోవాలంటూ రాసిన లేఖపై ప్రవీణ్ ప్రకాశ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్‌కు లేఖ రాశారు. కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ జరగకుండా చూశానన్న ఆరోపణను తోసిపుచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల అంశాన్నే ప్రభుత్వానికి నివేదించానని వెల్లడించారు. తానెలా ప్రభావితం చేస్తానో ఎస్‌ఈసీ చెప్పాలని సీఎస్‌ను కోరారు. ఎన్నికల వేళ విశాఖ, రంగారెడ్డిలో తనను బదిలీ చేసిన మాట నిజమన్న ప్రవీణ్ ప్రకాశ్... 2014, 2017లో పరిశీలకుడిగా ఈసీ తనను నియమించిందని గుర్తుచేశారు.
తానెప్పుడూ నిబంధనల పరిధి దాటలేదని స్పష్టం చేసిన ప్రవీణ్ ప్రకాశ్... తానెవర్నీ నియంత్రించేందుకు యత్నించలేదని స్పష్టం చేశారు. ఐఏఎస్‌లు నిబంధనల మేరకే విధులు నిర్వహిస్తారన్న ప్రవీణ్ ప్రకాశ్... ఎస్ఈసీ రాసిన లేఖకు మరుసటి రోజే సమాధానమిచ్చానని వివరించారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సీఎస్ ద్వారా జరపాలని ఎస్ఈసీని కోరానని చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం తనకు లేదన్న ప్రవీణ్ ప్రకాశ్... సీఎస్ సూచనల మేరకే నేను నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తనను తప్పుపట్టడం ఎంతవరకు న్యాయమని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను తప్పించాలని.. సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ