ఏకధాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ (Hyderabad Heavy Rains)చిగురుటాకులా వణికిపోయింది. హైదరాబాద్‌లోని మీర్‌పేట, సరూర్‌నగర్, చంపాపేట, మలక్‌పేట, హయత్ నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. చంపాపేట్ రెడ్డి కాలనీ, సరూర్ నగర్‌లోని కోదండరాం నగర్‌లను వరద ముంచెత్తింది. సరూర్ నగర్ పైన ఉన్న చెరువులు అలుగు పారడంతో పలు కాలనీలన్ని వరద ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లి కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనకు తోడు దోమలు విజృంభిస్తున్నాయని బాధిత జనం వాపోతున్నారు. రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద గుప్పిట్లో...
హయత్ నగర్‌లోని బంజారా, అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్ కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బాధిత ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. వర్షం పడ్డ ప్రతీసారి ఇదే దుస్థితి ఎదురవుతుందని... అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దశాబ్దాల క్రితం నిర్మించిన మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించి వరద బెడద నుంచి తప్పించాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
థియేటర్ గోడ కూలి...
వరద తాకిడికి దిల్‌సుఖ్‌నగర్ పరిధి గడ్డిఅన్నారంలోని శివగంగ థియేటర్ (Shiva Ganga Theater) ప్రహారీ గోడ కుప్పకూలింది. సినిమా హాల్‌లోకి ప్రవాహం చేరడం వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. గోడ పడిపోవడం వల్ల 28 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ యంత్రాంగం శిథిలాలను తొలగించి ప్రేక్షకులకు చెందిన వాహనాలను బయటకు తీశారు. దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించి ఇవ్వాలని కోరుతున్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ దారిలో ప్రధాన రహదారిపై మోకాల్లోతున నీరు చేరింది. గగన్‌పహాడ్ వద్ద అప్పా చెరువు నీరు చేరికతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.
అమీర్‌పేటలో అత్యధికం...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో 14.6, నందిగామ 13.3, ఎల్బీనగర్ 11.3, సైదాబాద్ మండలం కుర్మగూడలో 13.1 సెంటి మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బల్దియా యంత్రాంగం ప్రజలకు సూచించింది. అత్యవసర పనులు తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111ను సంప్రదించాలని సూచించారు.
లష్కర్ గూడ వాగు..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో లష్కర్ గూడ వాగు పొంగిపొర్లుతోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి లష్కర్ గూడ గ్రామాల పరిధిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత ఏడాది వర్షాల సమయంలో కారు వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. గత సంవత్సరం జరిగిన చేదు అనుభవంతో లష్కర్ గూడ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వాగుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: గుడిలోకి దూరిన ఏనుగు.. బైక్, షాప్ ధ్వంసం!