Hyderabad Metro : మెట్రోరైలు స్టేషన్లు సూసైడ్ స్పాట్స్‌గా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈఎస్‌ఐ స్టేషన్ ప్లాట్‌ఫాం పైనుంచి మంగళవారం యువతి దూకి ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్ పైనుంచి ఓ గర్భిణి దూకేందుకు యత్నించగా చివరి నిమిషంలో రక్షించారు. పది రూపాయల టికెట్ కొని ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఫ్లాట్‌ఫాంపై భదత్రా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు ‘ఈనాడు’ పరిశీలనలో కన్పించింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ నిఘా నిరుపయోగంగా మారుతోంది.
- కొవిడ్ తర్వాత నష్టాల పేరుతో భద్రతా, ఇతరత్రా సిబ్బందిలో కోత విధించడంతో ప్రయాణికుల కదలికలపై నిఘా కరవైంది.
- కొవిడ్‌కు ముందు ప్రతి స్టేషన్‌లో ఇరువైపులా ఫ్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది ఉండేవారు. బుధవారం పలు స్టేషన్లను పరిశీలించగా రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌లో తప్ప మిగతా స్టేషన్లలోని ప్లాట్‌ఫాంలపై భద్రతా సిబ్బంది కన్పించలేదు.
- ఫ్లాట్‌ఫాంను మెట్రోరైలు 6 కోచ్‌లను దృష్టిలో పెట్టుకుని కట్టారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. సగం ఫ్లాట్‌ఫాం ఖాళీగా ఉండటంతో ప్రయాణికులు ఫ్లాట్‌ఫాం చివరిదాకా వెళ్లి రోడ్డుమీదకు దూకేస్తున్నారు.
- టిక్కెట్ల జారీపై తప్ప సీసీకెమెరాల్లో పరిశీలించి అనుమానాస్పదంగా సంచరించేవాళ్లను హెచ్చరించే సమయం లేకుండాపోయింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని అఘాయి త్యాలకు పాల్పడుతున్నారు.
ఎలక్ట్రానిక్ నిఘా ఏమైనట్లు? : సిబ్బంది లేకపోయినా నిఘాకు ఢోకా లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్స్ సర్వైలెన్స్‌ను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌ఫాంలపై రెండువైపులా కలిపి 14చోట్ల సీసీకెమెరాల నిఘా ఉంది. కెమెరాల సంఖ్య 20 వరకుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థలు నిద్దురపోతున్నట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
తనిఖీల్లోనూ లోపాలు : మెట్రోరైలు పోలీసులు, ఎల్‌అండ్‌టీ అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి ఈఎస్‌ఐ స్టేషన్‌తోపాటూ పలు స్టేషన్లను పరిశీలించి భద్రతాలోపాలు గుర్తించారు. మంగళవారం జరిగిన ఆత్మహత్య ఘటనపై ఆరా తీశారు.
మెట్రో స్టేషన్ పై నుంచి దూకబోయిన గర్భిణి.. రక్షించిన సిబ్బంది : ఎస్సార్‌నగర్ మెట్రో స్టేషన్ పై నుంచి బుధవారం ఓ గర్భిణి దూకబోగా సిబ్బంది అప్రమత్తమై రక్షించారు. ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన గర్భిణి మహిళ(25) భర్తతో గొడవపడి బుధవారం ఉదయం ఎస్సార్‌నగర్ మెట్రో స్టేషన్ చేరుకుంది. స్టేషన్ ఫ్లాట్‌ఫాం పైకి చేరుకున్న మహిళ తన భర్తకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఈ విషయం అక్కడే ఉండి గమనించిన మెట్రో సిబ్బంది బాధితురాలిని రక్షించి ఎస్సార్‌నగర్ ఠాణాకు తీసుకొచ్చారు. పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.