Corona Effect on Events : కరోనా మహమ్మారి క్రమంగా తెలంగాణలోని హైదరాబాద్(భాగ్యనగరం)ను చుట్టుముడుతోంది. వైరస్ ఉద్ధృతి కారణంగా ఏటా నిర్వహించే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఇప్పటికే నుమాయిష్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ జాబితాలోకి తాజాగా పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ చేరాయి. మరోవైపు హైటెక్స్‌లో ప్రదర్శనలు, ఈవెంట్లను రద్దు చేస్తున్నారు.
ఆతిథ్య రంగం అతలాకుతలం..
Hyderabad Kite Festival Cancelled : కరోనా తొలి, రెండో దశ ధాటికి ఆతిథ్య రంగం అతలాకుతలమైంది. నెలల పాటు పర్యాటకులు లేక రూ.వేల కోట్ల నష్టాలు చవిచూసింది. ఐదు నెలలుగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో హోటళ్ల సంఘం ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నగరంలో చిన్న స్థాయి నుంచి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ 15 వేలకుపైనే ఉన్నట్లు అంచనా. కొవిడ్ రెండో ఉద్ధృతి తర్వాత వ్యాపారం క్రమంగా గాడిలో పడింది. డిసెంబరు మూడో వారానికి గరిష్ఠంగా 80 శాతానికి చేరింది. ఆ తర్వాత కొంత మేర తగ్గి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొంత పుంజుకుంది. అనంతరం కేసుల తీవ్రత పెరగడంతో వారం రోజుల్లోనే ఆక్యుపెన్సీ 20 శాతం మేర తగ్గిందని హోటళ్ల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. వివిధ కార్యక్రమాల కోసం గదులు, సమావేశ మందిరాలు బుక్ చేసుకున్నవాళ్లు రద్దు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
వేలమంది ఆర్థిక పరిస్థితి ఆగమాగం
Hyderabad Sweet Festival Cancelled : వరుసగా పలు వేడుకలు, ఈవెంట్లు రద్దు కావడంతో వీటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఆర్థికంగా చితికిపోవాల్సి వస్తోంది. నుమాయిష్ కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు నగరానికి వస్తుంటారు. ప్రదర్శన రద్దుతో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నస్థాయి హోటళ్ల నుంచి పెద్ద వాటి వరకూ గిరాకీ తగ్గి ఆదాయాన్ని కోల్పోవడంతో ఈ రంగంపై ఆధారపడ్డ వారంతా ఆర్థికంగా ఒడిదొడుకులకు లోనవుతున్నారు.
Festivals Cancelled Due to Corona : పతంగుల పండగకు భాగ్యనగరానికి ప్రత్యేక అనుబంధం ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచే ఈ పండగను అధికారికంగా జరిపేవారు. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా నగరంలో పతంగుల పండగ కొనసాగేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇపుడు ఏటా నిర్వహించే అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు కరోనా ఆంక్షలతో బ్రేకులు పడ్డాయి. ఏటా జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఈ వేడుకలు జరిగేవి. 25 రాష్ట్రాలు, 20 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేవారు. పతంగుల సీజన్‌లో నగరంలో రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. పాతనగరంలోని ధూల్‌పేట మాంజాకు క్రేజ్ ఎక్కువ. ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు మాంజా ఎగుమతి అవుతుంది. వ్యాపారం రూ.25 కోట్ల వరకు ఉంటుంది. ధూల్‌పేట్, మల్లేపల్లి, నాంపల్లితో పాటు గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లోని పతంగుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడేవి. ఇపుడవన్నీ చిన్నబోతున్నాయి.