ఖైదీలకు కరోనా సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో కరోనా పరిస్థితులను పర్యవేక్షించేందుకు, అర్హులైన ఖైదీల విడుదల విషయంలో ఏర్పాటైన ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహమ్మద్ అహ్సన్ రెజాతో కూడిన హైపవర్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోసారి సమావేశం అయింది.
* ఇప్పటివరకు ఎంతమంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు, ఎంతమంది కోలుకున్నారు, కన్నుమూశారు తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని జైళ్లశాఖను ఆదేశించింది.
* జైళ్లలో 490మంది ఖైదీలు, 150 మంది సిబ్బంది కరోనా బారిన పడినందున వారికి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య స్థితిగతులపై కుటుంబసభ్యులకు తెలియజేయాలంది.
* కొత్తగా వచ్చే ఖైదీలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పక నిర్వహించాలని, పాజిటివ్ నిర్ధారణ అయితే ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలంది.
* మధ్యంతర బెయిలు పొందేందుకు అర్హత కలిగి ఇంకా జైళ్లలో ఉండేవారి విడుదలకు చర్యలు తీసుకోవాలంది.
* వీడియో కాన్ఫరెన్స్, వాట్సప్ మార్గాల ద్వారా ఖైదీలకు ఈ-ములాఖత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది.
* 65ఏళ్లకు పైబడి క్యాన్సర్ తదితర వ్యాధులతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలను న్యాయసేవాధికార సంస్థల అధికారులతో సిద్ధం చేయాలని జైళ్ల సూపరింటెండెంట్లను ఆదేశించింది. అలాంటివారిని మధ్యంతర బెయిలుపై విడుదల చేయాలనే విన్నపంతో న్యాయసేవాధికార సంస్థల ద్వారా దరఖాస్తులు చేయాలని సూపరింటెండెంట్లకు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా