పవన ,సౌర విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు నాలుగు వారాల్లోగా చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చి.. ఇప్పటివరకు ఎందుకు చెల్లించలేదని విద్యుత్ పంపిణీ సంస్థలను న్యాయస్థానం నిలదీసింది. కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపట్టి బాధ్యులైన ఉన్నతాధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎస్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చొప్పున బకాయిలు చెల్లించాలని డిస్కంలను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టుకిచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఏఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ తరఫున ఎస్పీడీసీఎల్ ఛీఫ్ జనరల్ మేనేజరు సంతోషరావు హైకోర్టులో తాజాగా అఫిడవిట్ వేశారు. చెల్లించడానికి మరో నాలుగు వారాలు గడువు కావాలన్నారు. మొత్తం చెల్లించాల్సిన బకాయిలు రూ. 2555.21 కోట్లుండగా.. రూ.1955.44 కోట్లు చెల్లించామన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక సకాలంలో బకాయిలు చెల్లించలేదన్నారు. పవన విద్యుత్ సంస్థలకు రూ.401 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించాలన్నారు. సౌర విద్యుత్ సంస్థలకు రూ. 198 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
సీజీఎం కోర్టుకు ఇచ్చిన వివరాల్లో కొన్ని సౌర, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు "నిల్ " అని చూపడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ల అభ్యంతరంపై విడివిడిగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని డిస్కంలను ఆదేశించింది.
ఇదీ చదవండి:
మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్... త్వరలో..!