పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)తో మరోసారి సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి స్థాయికి తగ్గని ఇద్దరు లేదా ముగ్గురు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయాలని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అందాక మూడు రోజుల్లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్ణయించిన సమయంలో.. కమిటీ సభ్యులు ఎస్‌ఈసీతో సమావేశం కావాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ విషయమై చెబుతున్న అభ్యంతరాలు, కరోనా టీకా ప్రారంభానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నతాధికారులు.. ఎస్‌ఈసీ ముందు ప్రస్తావించవచ్చని పేర్కొంది. ఏ కారణంతో ఎన్నికల సంఘం ఎన్నికల్ని నిర్వహించదలచిందో చర్చించుకుని, సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని తేల్చిచెప్పింది. అంతిమంగా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి బుధవారం విచారణ జరిపి ఈ మేరకు సూచనలు చేశారు.
బంతి ఎన్నికల కమిషన్ కోర్టులో
కరోనా టీకా వ్యవహారంలో కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిందని, షెడ్యూల్ ఇవ్వబోతోందని గత విచారణలో ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్ చెప్పారని న్యాయమూర్తి గుర్తుచేశారు. కరోనా టీకా విషయంలో కేంద్ర ఉత్తర్వులతో పాటు ఎన్నికలపై ప్రభుత్వ అభ్యంతరాల్ని ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత బంతి ఎన్నికల కమిషన్ కోర్టులో ఉంటుందన్నారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఓ నిర్ణయానికి వచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. సంప్రదింపులపై అభ్యంతరం లేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎన్నికల తేదీని ఇంకా నోటిఫై చేయలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల విషయంలో సంప్రదింపులు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.
ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కరోనా టీకా పంపిణీకి కేంద్రం ఎలాంటి షెడ్యూల్ ఇవ్వలేదన్నారు. ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ ప్రభుత్వం చూపుతున్న కారణాలు సహేతుకంగా లేవన్నారు. సంప్రదింపుల ప్రక్రియ అంగీకారమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఎస్‌ఈసీతో చర్చించి చెబుతామన్నారు. కొద్దిసేపటి తర్వాత జరిగిన విచారణలో అశ్వనీకుమార్ మాట్లాడుతూ సంప్రదింపుల విషయమై న్యాయస్థానం చేసిన ప్రతిపాదనపై అభ్యంతరం లేదన్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారని గుర్తుచేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. మరో విడత సంప్రదింపులు జరపాలని సూచించారు.
ఇవీ చూడండి: