ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు హైకోర్టులో ఊరట లభించింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల ప్రవేశాలు 20 కంటే తక్కువ, అసలు ప్రవేశాలు లేని పాఠశాలల గుర్తింపును ఎందుకు ఉపసంహరించుకోకూడదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు ఇవ్వాలని రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ), జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్య కమిషనర్ గతేడాది నవంబర్ 24న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ ప్రొసీడింగ్స్ ఏపీ విద్యా హక్కు చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
పాఠశాల విద్య కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.తులసీ విష్ణు ప్రసాద్‌తో పాటు మరి కొన్ని పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వ సాయం పొందని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, మైనార్టీ, నాన్ మైనార్టీ పాఠశాలలకు నిబంధనలు వర్తించవని 2012 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించిన న్యాయమూర్తి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామన్నారు.
ఇదీ చదవండి: Cannes Film festival: 'బ్రాండ్ ఇమేజ్‌తో కాదు.. ఇండియన్ బ్రాండ్‌తో వచ్చా'