హైకోర్టును కరోనా రెడ్ జోన్‌గా ప్రకటించాలని.. హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతి పై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యుడు లక్ష్మీనర్సయ్య దాఖలు చేసిన పిల్ లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ భానుమతి కౌంటర్ దాఖలు చేశారు. పిల్ దాఖలు చేయడం వెనుక పిటిషనర్‌కు సదుద్దేశం లేదన్నారు. జరిమానా విధించి వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. హైకోర్టు వెల్లడించిన వ్యతిరేక తీర్పులను ప్రభుత్వం ఆనందంగా అంగీకరించలేకపోతోందని కౌంటర్లో పేర్కొన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ ఉన్నత విద్య నియంత్రణ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. పదవీ విరమణ చేశాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను చైర్మన్ గా నియమించడంతో ప్రభుత్వాన్ని సంతృప్తి పరిచేందుకు బీసీ అసోసియేషన్ ముసుగులో హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారన్నారు.
హైకోర్టులో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విఫలమయ్యారంటూ రాష్ట్రపతి, సుప్రీం సీజే , కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు చేసిన బీసీ సంఘానికి జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షుడని తెలిపారు. హైకోర్టుకు వ్యతిరేకంగా జస్టిస్ ఈశ్వరయ్య సంఘం చేసిన ఆరోపణలనే .. హైకోర్టును కరోనా రెడ్ జోన్ గా ప్రకటించాలని పేర్కొంటూ బీసీ, ఎస్సీ , ఎస్టీ - మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిల్ లోనూ పేర్కొన్నారన్నారు. హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ గుండెపోటు లేదా కరోనాతో చనిపోయి ఉండొచ్చన్నారు. పని ఒత్తిడి వల్ల కన్నుమూయలేదన్నారు. తాజాగా ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి , జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం వ్యాజ్య విచారణ స్వీకరణ అర్హతపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది.
ఇదీ చదవండి: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం