HIGH COURT ON CINEMA TICKETS: సినిమా టికెట్ ధరల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిసెంబర్ 27న జీవో 144 జారీచేశామన్నారు. కమిటీ డిసెంబర్ 31న ఓ సారి భేటీ అయిందని.. జనవరి 11న మరోసారి భేటీ కానుందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ధరలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం అప్పీళ్లపై విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ.. గతేడాది ఏప్రిల్ 8న రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో 35 ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్ యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జీవో 35కు పూర్వం అనుసరించిన విధానాన్ని ధరల ఖరారు విషయంలో పాటించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. ఇటీవల అప్పీళ్లపై విచారణ చేసిన ధర్మాసనం.. ధరల ఖరారు విషయంలో సినీపరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. థియేటర్ల యాజమాన్యాలు సంయుక్త కలెక్టర్లను సంప్రదించాక టికెట్ ధరలను ఖరారు చేయాలని స్పష్టంచేసింది.
ఏజీ వాదనలు వినిపిస్తూ కొత్త కమిటీ ఏర్పాటు చేశామన్నారు. థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ .. ధరలను ప్రతిపాదిస్తూ యాజమాన్యాలు పంపిన ప్రతిపాదనలను జేసీలు తిరస్కరిస్తున్నారన్నారు. దీంతో రిజిస్టర్ పోస్టులో పంపిస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జేసీలు వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆయా జేసీలపై కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం తరపున ఏజీ స్పందిస్తూ.. మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపాదనలను జేసీలు స్వీకరించేలా తగిన సూచనలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: