ఎన్నికల కమిషన్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్, తొలగింపు జీవోలపై ప్రభుత్వం ఎస్‌ఈసీ కార్యదర్శి వేసిన అఫిడవిట్‌లపై నిమ్మగడ్డ రమేశ్ రిప్లై అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసే అంశం తనకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నానని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇటువంటి విషయాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని పిటిషనర్ అఫిడవిట్‌లో తెలిపారు. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం కార్యదర్శికి చెప్పాల్సిన అవసరంలేదని తెలిపారు. కమిషనర్ రోజువారీ పనుల్లో సాయం చేయడం మాత్రమే సెక్రటరీ విధులని తెలిపారు.
ఒక రోజు ముందే నిర్ణయం
ఎన్నికల సంఘంలోని న్యాయవిభాగం, ఎన్నికల వాయిదా నోటిఫికేషన్, డ్రాప్టు తయారుచేసిన తర్వాతే తాను సంతకం చేసినట్లు తెలిపారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంపై ఒకరోజు ముందే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వేసిన కౌంటర్‌పై ఒక రిప్లై పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించారు. తాజాగా ఎస్‌ఈసీ కార్యదర్శి అఫిడవిట్‌ను దాఖలు చేయటంతో అందులోని అంశాలపై అభ్యంతరం తెలుపుతూ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై రేపు హైకోర్టులో తుది విచారణ జరుగనుంది.
సంస్కరణలు వాస్తవం కాదు
ప్రభుత్వం చెబుతున్నఎన్నికల సంస్కరణల ప్రక్రియ ఫిబ్రవరిలోనే మొదలు పెట్టామనటం వాస్తవం కాదని అఫిడవిట్ లో తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ని కుదిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఏకపక్షంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు చేయకుండానే ప్రభుత్వం షెడ్యూల్ కుదించిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయని ఆయన కోర్టు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న ఎన్నికల సంస్కరణలు వాస్తవిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. ఎన్నికల సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సంస్కరణలో భాగంగా ఈసీ పదవీ కాలం తగ్గించినా ఆ మార్పు ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తికి వర్తించదని కోర్టుకు తెలిపారు.
ఆ కథనాలలో వ్యత్యాసాలు
కేంద్రానికి తాను రాసిన లేఖ, ఏపీలో ఏకగ్రీవాలు జరిగిన తీరుపై హైకోర్టులో దాఖలు చేసిన రిప్లైలో అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులకు మీడియా లో ప్రసారమైన కథనాలకు చాలా వ్యత్యాసం ఉందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: