తమను ప్రైవేటు కళాశాలలు చేర్చుకోవట్లేదంటూ వైద్య విద్యార్థులు వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. వైద్య విద్య ఫీజుల విషయంలో అభ్యంతరాలుంటే ప్రభుత్వంతో చర్చలు జరపాలని... లేదా న్యాయపరంగా వెళ్లాలి కానీ.. విద్యార్థులను చేర్చుకోకపోవడం సరైన చర్య కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఫీజులకు సంబంధించి ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కు.. ప్రైవేట్ కాలేజీలు ఏమి నివేదించాయో కోర్టుకు తెలపాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఇదే అంశంపై మెడికల్ కళాశాలలు వేసిన మరో వ్యాజ్యంపై మరో బెంచ్ విచారణ చేసింది. పీజీ మెడికల్, దంత వైద్య విద్య ఫీజుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఫీజులు నిర్ణయించే సమయంలో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని.. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కళాశాలల తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కాలేజీలు నిర్వహించలేమని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసునూ 17 వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి...