రాజధానికి వ్యవహారానికి సంబంధించిన అనేక అంశాలపై రైతులు వేసిన వ్యాజ్యాలపై... హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషన్లను అంశాల వారీగా విభజించి వేర్వేరుగా విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. రాజధాని పరిధిలో అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు అంశాలపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సహా... జీఎన్ రావు, బీసీజీ, హైపవర్ కమిటీల నివేదికలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపైనా... ధర్మాసనం విచారణ జరిపింది. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందన్న హైకోర్టు.... ఈ వ్యాజ్యాలపైనా రాష్ట్రం సహా కేంద్రం ప్రభుత్వమూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని సూచించింది.
పనులు పునరుద్ధరించాలి..
రాజధాని పరిధిలో ప్రభుత్వం నిలిపివేసిన అభివృద్ధి పనులను తక్షణం పునరుద్ధరించాలని... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి... అమరావతిలోనే శాశ్వత హైకోర్టు కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపిందని చెప్పారు. అందువల్లే హైకోర్టు విభజనకు సుప్రీం ఆదేశించిందని వెల్లడించారు. రాజధానిలో ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశారని..... పనులు కొనసాగుతుండగా ఏకపక్షంగా నిలిపేశారని వాదించారు. హైపవర్ కమిటీ.. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని... సుప్రీం న్యాయవాది అశోక్ భాన్ వాదించారు.
నాడు తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది..
హైకోర్టు ఉమ్మడిగా ఉన్నప్పుడు... తెలంగాణ హైకోర్టును హైదరాబాద్‌లోనే వేరే చోట ఏర్పాటు చేసుకుంటామన్న ఆ రాష్ట్ర అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిందని... న్యాయవాది అంబటి సుధాకరరావు వాదించారు. హైకోర్టు ఏర్పాటులో శాసనసభ, కార్యనిర్వాహక యంత్రాంగానికి... ఏమాత్రం అధికారం ఉండదన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల్ని కొనసాగించాలని.. న్యాయవాదులు మురళీధరరావు, ఎంఎస్ ప్రసాద్ కోరారు.
విచారణ వాయిదా...
రాజధాని వ్యవహారంతో ముడిపడి ఉన్న పిటిషన్లు ఎక్కువగా ఉన్నందున... సమగ్ర విచారణకు వీలుగా... 'పనుల కొనసాగింపు, బిల్లులు, నివేదికలు, హైకోర్టు తరలింపు'లపై వ్యాజ్యాలను... అంశాల వారీగా విభజించాలని..... రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. అభివృద్ధి పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు అంశాలపై వ్యాజ్యాల విచారణను మార్చి 17కు..... పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సహా కమిటీల నివేదికలపై వ్యాజ్యాల విచారణను మార్చి 30కి వాయిదా వేసింది.