కడప జిల్లాలో నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నమండెంలో అత్యధికంగా 13.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీరబల్లి, రాజంపేట , జమ్మలమడుగు డివిజన్లలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వేరుశెనగ పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నా, పాపాగ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీ నీటమునిగాయి. మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. బద్వేల్ లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్, మైదుకూర్ రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రకాశం జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ కురిసింది. మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో కుండపోత వర్షాలు కురిసాయి. వర్షం ధాటికి తోకపల్లిలో సుమారు 30 ఎకరాల్లో చిక్కుడు, టమోటా నీట మునిగాయి. పత్తి చేలల్లోకి కూడా నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షానికి కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రహదారిపై సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో చెట్టు పడిపోయింది. దీంతో కొంత సమయం పాటు ట్రాఫిక్ ఏర్పడింది. స్థానికులు చెట్టును తొలగించడంతో వాహనదారులు రాకపోకలు సాగించారు.
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు తీర ప్రాంత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
పుట్టపర్తిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. చిత్రావతి నది పై నిర్మించిన చెక్ డ్యాములు పై వర్షపు నీరు పొంగి పొర్లుతుంది. చిత్రావతిలో నుంచి నీరు రాయలసీమలోని అతి పెద్ద చెరువు బుక్కపట్నం చెరువులోకి చేరుతున్నాయి.
ఇదీ చదవండి: వెదర్ అప్డేట్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం