పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ... ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగం, ఏపీ శాసనసభ, శాసనమండలి నిబంధనలకు విరుద్ధంగా ఆ చట్టాలను రూపొందించారని పేర్కొన్నారు. వాటిని రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. మండలిలో బిల్లుల్ని టేబుల్‌పై పెట్టినంత మాత్రాన వాటిని పరిగణనలోకి తీసుకున్నట్లు కాదన్నారు.
భారత ప్రభుత్వ చట్టం-1935, రాజ్యాంగ ముసాయిదా చర్చల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. బిల్లుల్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారని గుర్తుచేశారు. శాసనసభలో బిల్లుల పరిచయం, తర్వాత పరిగణనలోకి తీసుకోవడం అనంతరం పాసింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మండలి విషయంలో... పరిచయం ఉండదని తెలిపారు. మోషన్ మూవ్ చేశాక ... పరిగణనలోకి తీసుకోవడం.. ఆ తర్వాత పాసింగ్ విధానం ఉంటుందన్నారు. ఈ విధానం మండలిలో చోటు చేసుకోలేదన్నారు. మండలి ఛైర్మన్ బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారని తెలిపారు.
విస్తృతాధికారాన్ని ఉపయోగించి సెలక్ట్ కమిటీ వేశారన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కమిటీ ఏర్పాటు విషయంలో గెజిట్ ప్రకటన జారీ చేయకుండా... శాసనసభ మండలి కార్యదర్శి రెండు నెలలు జాప్యం చేశారన్నారు. మండలి వైపు నుంచి ఆలస్యం కాలేదని చెప్పారు. సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని మండలి ఛైర్మన్ పలుమార్లు కార్యదర్శిని కోరినప్పటికీ... ప్రయోజనం లేదన్నారు. మండలిలో మొదటిసారి బిల్లులు పెట్టి మూడు నెలల గడువు ముగిచిందన్న కారణంతో... అధికరణ 197ను అనుసరించి శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి పాస్ చేయించడం చట్ట విరుద్ధమన్నారు.
మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో... న్యాయవాది జీవీఆర్ చౌదరి వాదనలు వినిపించారు. రాష్ట్రం పేరును మార్చే అధికారం.. ఆయా రాష్ట్రాలకు లేదని పేర్కొన్నారు. అలాంటిది మూడు రాజధానులను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంటుందని ప్రశ్నించారు. అధికరణ 3 ప్రకారం రాష్ట్రం పేరు మార్చాలన్న పార్లమెంట్ చట్టం చేయాలని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం.. రాజధాని ఏర్పాటు వ్యవహారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం సరికాదన్నారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే కోట్ల రూపాలయ ప్రజాధనం ఖర్చుచేశారని వివరించారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ విభాగాలు ఒక్కదగ్గరే ఉంటే సామరస్యపూర్వక పని విధానం సాధ్యమవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండీ... మూడోరోజు శాసనసభ నుంచి తెదేపా సభ్యుల సస్పెన్షన్