పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలుచేసిన వ్యాజ్యంలో బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మిగిలిన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, మరికొందరు రైతులు దాఖలు చేసిన వ్యాజ్యం తుది విచారణలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ మూడోరోజు వాదనలు వినిపించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కుల్ని హరించడానికి వీల్లేదన్నారు. ఆ వాదనలకు బలం చేకూర్చేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ధర్మాసనానికి నివేదించారు. వాదనలు పూర్తికావడంతో మౌఖికంగా చెప్పిన వాదనల్లోని ముఖ్యాంశాల్ని రాతపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం సూచించింది. విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: