లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు కేటాయించాలంటూ నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 6న తీసుకొచ్చిన జీవో 145ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆ జీవోను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ప్రకృతి అవెన్యూస్ ఫర్మ్ మేనేజింగ్ భాగస్వామి మేడికొండూరి లక్ష్మి శకుంతల దేవీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని పొందేందుకు వీలుగా ఏపీ భూ అభివృద్ధి(లేఅవుట్, సబ్ డివిజన్) నిబంధన 13(1)(డి)కి సవరణ చేశారన్నారు. అందుకు అనుగుణంగా జీవో 145 జారీచేస్తూ ప్రైవేటు లేఅవుట్‌లలో యజమానులు/డెవలపర్లు 5శాతం స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని జీవోలో పేర్కొన్నారని తెలిపారు.
లేఅవుట్‌లో ఇవ్వలేకపోతే 3కి.మీ దూరంలో 5శాతం స్థలాన్ని ఇవ్వాలన్నారని వివరించారు. లేదా ఆ స్థలానికి మౌలిక(బేసిక్) విలువ చెల్లించాలని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఐదుశాతం స్థలం కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం అధికరణ 14, 19(1)(జి), 21, 300ఏకు విరుద్ధం అన్నారు. నిబంధనలకు కొత్తగా సవరణ చేయడం ద్వారా ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం భూమి తీసుకోవడానికి యత్నిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. పరిహారం చెల్లించకుండా స్థలాన్ని అప్పగించాలని కోరే అధికారం ప్రభుత్వానికి ఏ చట్టాలు ఇవ్వలేదన్నారు. సవరణ జీవో తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
ఇదీ చదవండి: High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు