HC On Covid Food Bills: కొవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ఈనెల 11 స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్భదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్లను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఆహారం సరఫరా చేసిన హోటల్ యజమానులు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం తగదని హితవు పలికింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈమేరకు ఆదేశాలిచ్చారు. కొవిడ్ కేర్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసిన తమకు ప్రభుత్వం రూ. 2.04 కోట్లు బకాయిలు చెల్లించలేదని పేర్కొంటూ... శ్రీకాకుళానికి చెందిన మినర్వా హోటల్ యజమాని మెట్ట నాగరాజు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయవాది కంభంపాటి రమేశబాబు వాదనలు వినిపిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆహార సరఫరాకు విజ్ఞప్తి చేస్తూ 2021 మే 2న ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పిటిషనర్ మే 5 నుంచి జులై 13 వరకు ఆహారం సరఫరా చేశారన్నారు. జూన్, జులై, అక్టోబర్ నెలల్లో ఆర్థిక శాఖకు బిల్లులు సమర్పించి సొమ్ము చెల్లించాలని కోరారన్నారు. బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదన్నారు. మరికొన్ని బిల్లులను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో ఇంకా అప్లోడ్ చేయలేదన్నారు. మరికొన్ని బిల్లులు అప్లోడ్ చేసినా బకాయిలు చెల్లించలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ బాస్కర్ కాటంనేని ఈనెల 11 న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: AP High Court: ఏపీ హైకోర్టుకు ఇంటెలిజెన్స్ డీజీ క్షమాపణలు