HC On Amara Raja Batteries: కాలుష్య కారకం పేరుతో పరిశ్రమ మూసివేతకు ఏపీపీసీబీ ఇచ్చిన మూసివేత ఉత్తర్వులపై అమర రాజా బ్యాటరీల తయారీ సంస్థ ఆధీకృత అధికారి నాగుల గోపీనాథారావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉద్యోగుల రక్తంలో సీసం శాతం పరిమితంగానే ఉందని ... పరిశ్రమ తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. నివేదికల్లో ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. పరిశ్రమలో కాలుష్య నియంత్రణకు ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. పరిశ్రమ వ్యవస్థాపక యజమాని సైతం పరిశ్రమ ప్రాంగణంలోనే ఉంటారన్నారు. ఏపీపీసీబీ చేస్తున్న ఆరోపణలు సత్యదూరం అన్నారు.
నిబంధనలను పాటిస్తున్నామని పరిశ్రమ, పాటించడంలేదని ఏపీపీసీబీ పరస్పర విరుద్ధమైన వాదనలు లేవనెత్తుతున్నాయన్నార . ఈనేపథ్యంలో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి తమ సంస్థలో తనిఖీలు చేయించడానికి అభ్యంతరం లేదన్నారు. ఏపీ పీసీబీ తాజాగా మరో సంజాయిషీ నోటీసు తమకు ఇచ్చిందన్నారు. పరిశ్రమ నిర్వహణకు అంగీకారం ఈనెలతో ముగియనుందని... దానిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరారు. ఏపీపీసీబీ తరపున సురేందర్ రెడ్డి స్పందిస్తూ .. తనిఖీ కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహించాలన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు ఈనెల 11 న సీనియర్ న్యాయవాది రానున్నారన్నారు. ఆ రోజుకు వాయిదా వేయాలని కోరారు. అమర రాజా తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ .. హైకోర్టు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఎవరు నేతృత్వం వహించినా అభ్యంతరం లేదన్నారు. 11 విచారణ అనంతరం సంయుక్త తనిఖీ బృందాన్ని నియమిస్తామని హైకోర్టు తెలిపింది. వ్యాజ్యంపై విచారణ చేసి తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. విచారణ పెండింగ్లో ఉండగా మళ్లీ మళ్లీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని అభిప్రాయం వ్యక్తంచేసింది.
ఇదీ చదవండి: AP High Court: ఏపీ హైకోర్టుకు ఇంటెలిజెన్స్ డీజీ క్షమాపణలు