రాష్ట్రంలోని పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్లను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 2020 జులై పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించిన వారందరికీ గ్రేడ్లు ఇవ్వటంతో పాటు వారిని పాస్ చేస్తూ ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు.
కొవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం లో పరీక్షలు నిర్వహించ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని.. ఆ తరువాత లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు రద్దు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రాసేందుకు సిద్ధం అయ్యి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులను గుర్తించి పాస్ చేసి గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది. ముందస్తు పరీక్షలో సదరు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. నేడు మరోసారి సమావేశం