కరోనా విలయతాండవం చేస్తున్నా ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న తమకు సరైన గౌరవం లభించట్లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న తమకు అవమానాలు, బెదిరింపులే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైద్యుల సంఘం ఇప్పటికే సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసింది. మరోసారి సీఎస్‌ను కలిసి తమ సమస్యలు వివరించేందుకు సిద్ధమవుతోంది.
కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించండి
ఒకవైపు విధులు మరోవైపు ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావటం ఇబ్బందిగా ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం అభిప్రాయపడింది. వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించడం తమకేం ఇబ్బంది లేకున్నా 15 రోజులకు ఒకసారి నిర్వహిస్తే తమ విధులకు ఆటంకం ఉండదని సూచిస్తోంది. ఇన్ని తట్టుకుని విధులకు హాజరవుతున్నా జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు నిర్వహించే సమీక్షా సమావేశాల్లో డీఎమ్హెచ్వోలను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది. ప్రకాశం జిల్లా డీఎమ్హెచ్వో సమావేశ ప్రారంభ సమయం కన్నా కాస్త ఆలస్యంగా వచ్చారన్న నెపంతో జాయింట్ కలెక్టర్... ఆయన్ని నిల్చోబెట్టారని ప్రస్తావించింది. అనంతపురం డీఎమ్‌హెచ్‌వోను సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా దూషించినట్లు తెలిపింది. ఈ విషయాలను సీఎస్‌కు వివరించనున్న వైద్యుల సంఘం.. కొవిడ్-19 బాధ్యతలు జిల్లా సంయుక్త కలెక్టర్లు కాకుండా నేరుగా కలెక్టర్ పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరే అవకాశం ఉంది.
స్పష్టమైన హామీలు లేవు
ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన యాప్‌లకు అనుగుణంగా వివరాలు నమోదు చేయటం వైద్యులకు ఇబ్బందిగా ఉందని వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జయధీర్ వెల్లడించారు. కొవిడ్ బారిన పడిన వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలూ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యుల స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వలేని పక్షంలో కొత్తగా నియమిస్తున్న వైద్యులు, ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని తేల్చి చెప్పారు
ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు ఏ సమయంలోనైనా సిద్ధమంటున్న వైద్యుల సంఘం.. వ్యవస్థ నీరుగారిపోతుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పితాని కుమారుడు