ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రక్రియ వెంటనే కుదరకపోవటంతో రాజ్‌భవన్ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు పంపించారు. ఆ ప్రత్యేక విమానంలో గవర్నర్ దంపతులు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో వెళ్లారు.
ఆరోగ్యం నిలకడగా ఉంది: ఏఐజీ ఆసుపత్రి
88 ఏళ్ల వయసున్న గవర్నర్‌కు కొవిడ్ మధ్యస్థ లక్షణాలు ఉండడం, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రత్యేక నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆక్సిజన్ స్థాయిల్లో ఎలాంటి ఇబ్బందీ లేదని బుధవారం సాయంత్రం ఏఐజీ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గవర్నర్ సతీమణికి కొవిడ్ సోకినప్పటికీ ఆమెలో స్వల్ప లక్షణాలే ఉన్నాయి.
రాజ్‌భవన్‌లో మరో పదిమందికి
రాజ్‌భవన్‌లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు, గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కొవిడ్ సోకింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఆరా!
గవర్నర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ ఛైర్మన్, సీనియర్ వైద్యుడు డి.నాగేశ్వరరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ గవర్నర్ ఆరోగ్యంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. గవర్నర్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు..
ఇదీ చదంవడి..