Govt Teacher Suicide: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారు. మండలంలోని రహత్‌నగర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సరస్వతికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ద్వారా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈనెల 7న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాలో విధుల్లో చేరారు.
ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. కొన ఊపిరితో ఉండగా.. కుటుంబ సభ్యులు ఆర్మూర్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త బేతల భూమేశ్... ఉపాధి నిమిత్తం ఖతర్ వెళ్లారు. ఉద్యోగ బదిలీ వల్లే సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి స్వామి ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
బండి సంజయ్ స్పందన...
బాబాపూర్ గ్రామంలో ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచి వేసిందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని మీ తరపున మేము పోరాడుతున్నామని ధైర్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను సమీక్షిస్తామని వివరించారు.
రెండురోజుల క్రితం హెడ్‌మాస్టార్...
పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాడు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఇటీవలె చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాణోత్ జేత్రాం నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఉద్యోగుల జిల్లా కేటాయింపుల్లో ఆయనను ములుగు జిల్లాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అంత దూరం ఎలా వెళ్లాలనే ఆలోచనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించారు.
ఇవీ చూడండి: ROAD ACCIDENT AT GIDDALUR: కారు- బొలెరో ఢీ.. ఎనిమిది మందికి గాయాలు