ఆక్వా ఉత్పత్తులు మినహా.. ఇతర ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిపెట్టింది. ప్రత్యేకించి శుద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను పెద్దఎత్తున ఎగుమతి చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సారధ్యంలోని అపెడా.. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తుల ఎగుమతులపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు, సహకారం అందిస్తోంది. దాన్ని అందిపుచ్చుకునేందుకు ఏపీ వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడెక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ... అపెడా సహకారంతో రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. పోషక విలువలేవీ కోల్పోకుండా బంగాళదుంపలు, పాలకూర, స్వీట్ కార్న్, బటానీ గింజలు, పండ్లు, ఇతర కూరగాయలను కూడా శీతలీకరించి అవసరమైన మార్కెట్లకు తరలించేలా ప్రణాళిక చేపట్టనున్నారు. విదేశాల్లో పెద్దఎత్తున ఈ తరహా శీతలీకరించిన ప్యాకింగ్ చేసిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ఉన్న భారీ డిమాండ్‌ను దక్కించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
2020-21లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ దేశవ్యాప్తంగా పువ్వులు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు 143 కోట్ల రూపాయల విలువైన 5690 టన్నుల ఎగుమతి అయ్యాయి. అలాగే పండ్లు, కూరగాయల 375 కోట్ల రూపాయల మేర ఎగుమతులు జరిగినట్టు అపెడా చెబుతోంది. ఇకా తాజా పళ్లు 1344 కోట్లు, తాజా కూరగాయలు 2270 కోట్ల రూపాయల మేర ఎగుమతి అయ్యాయి. ఇక శుద్ధి చేసి శీతలీకరించిన ఉత్పత్తులు 2482 కోట్ల రూపాయల మేర ఎగుమతి అయ్యాయి. వీటిని మరింతగా పెంచుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మొత్తంలో ఏపీ వాటా కూడా గణనీయంగానే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న అరకు కాఫీ, పసుపు, పొగాకు లాంటి వాణిజ్య పంటలు, అలాగే మిరియాల లాంటి సుగంధ ద్రవ్యాలు, కోకోవా తదితర ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
చిత్తూరు జిల్లా మదనపల్లిలోని టమాటాకు అంతర్జాతీయంగా మార్కెట్ తీసుకువచ్చేందుకు గుజ్జుగా చేసి ఐక్యూఎఫ్ ఉత్పత్తిగా మార్చి ఎగుమతులు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అటు రాయలసీమ ప్రాంతంలో లభ్యం అయ్యే ఉద్యాన ఉత్పత్తులను కూడా ఐక్యూఎఫ్గా మార్చి ఎగుమతి చేయనున్నారు.
ఇదీ చదవండీ... పట్టాలెక్కుతున్న జన జీవితం..పుంజుకుంటున్న కార్యకలాపాలు