ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. కొవిడ్-19 ఉద్ధృతి అనంతరం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసినట్టు ప్రభుత్వం మెమోలో పేర్కొంది. ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతీ రోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాల్సిందిగా ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు వస్తే ఆలస్యంగా హాజరైనట్టు పరిగణిస్తామని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. సచివాలయ మాన్యువల్ ప్రకారం నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్యంగా హాజరును అనుమతిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉంటేనే పూర్తి హాజరుగా పరిగణిస్తామని సాధారణ పరిపాలనశాఖ పేర్కొంది. మద్యాహ్నం 1.30 అనంతరం వరకూ మాత్రమే విధుల్లో ఉంటే సగం హాజరును మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విధులకు గైర్హాజరైనట్టుగా నమోదు చేయాల్సిందిగా సూచించింది.
ఇదీ చదవండి: