AP Beverages Corporation: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం చర్చనీయాంశమవుతోంది. ఈ కార్పొరేషన్‌కు ఏడాదికి దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయాన్ని చూపించేందుకు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. కార్పొరేషన్‌కు ఆదాయం ఉందని చూపితేనే కొత్త అప్పులు తెచ్చుకునేందుకు అవకాశముంది. మద్యం అమ్ముకుంటూ.. స్పెషల్ మార్జిన్ రూపంలో ఆదాయం చూపించి దీని ఆధారంగా రూ.వేల కోట్ల రుణాలు పుట్టించి సంక్షేమ పథకాలు అమలుచేస్తామని ప్రభుత్వం లోగడే ప్రకటించింది. ఇందుకనుగుణంగా తొలుత ఆర్డినెన్సు తెచ్చింది. ఆ తర్వాత బిల్లును ఉభయసభలు ఆమోదించగా.. తాజాగా గవర్నర్ ఆమోదించడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ చట్టం ఏం చెబుతోంది?: ‘తన మద్యం వ్యాపారంలో భాగంగా రిటైల్ వినియోగదారులకు లేదా ఇతర లైసెన్సు ఉన్నవారికి మద్యం అమ్ముతూ ప్రత్యేక మార్జిన్ లేదా ట్రేడ్‌మార్జిన్‌ను కార్పొరేషన్ వసూలు చేయవచ్చు. ఈ మొత్తం కార్పొరేషన్ ఆదాయం అవుతుంది’ అని కొత్త చట్టం పేర్కొంటోంది. ఈ మేరకు 1993 ఐఎంఎఫ్‌ఎల్ చట్టానికి సవరణలు చేసింది. గతంలో 5/2012లో సవరించగా తాజాగా 9/2022గా చట్ట సవరణ చేసింది.
ఎందుకీ చట్టం?: మద్యంపై అదనపు ఎక్సయిజ్ సుంకం విధించి భవిష్యత్తులో ఆ రూపేణా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ)కు మళ్లించి ఆ కార్పొరేషన్ ద్వారా రూ.వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈ విధానాన్ని రెండేళ్లపాటు అమలుచేసి తెచ్చిన అప్పులతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని ప్రభుత్వమే చెప్పింది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ భవిష్యత్తు ఆదాయాన్ని ఎస్క్రో చేసి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రమే తప్పుపట్టింది. ఏపీ కార్పొరేషన్లకు రుణాలివ్వడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకులను కూడా కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. దీంతో ఏపీఎస్‌డీసీకి చివరివిడత నిధులు ఆగిపోయాయని సమాచారం. దీంతో కొత్తగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ ఎత్తుగడ వేసింది.
కార్పొరేషన్‌కు ఆదాయం కోసమే..: బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలంటే రుణం తీర్చే మార్గాన్ని బ్యాంకులకు చూపించాలి. ఎస్క్రో విధానాన్ని కేంద్రం అంగీకరించలేదు. అందుకే మద్యంపై ప్రభుత్వం విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించింది. ఆ మేరకు చట్టాన్ని సవరించింది. అంటే ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కోత పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో బేవరేజస్ కార్పొరేషన్ స్పెషల్‌మార్జిన్ రూపంలో అదే స్థాయి మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఇలా వసూలైన మొత్తం కార్పొరేషన్ ఆదాయంగా ఉంటుందని చట్ట సవరణ చేసి అప్పులకు మార్గం సుగమం చేసింది. ఖజానాకు వ్యాట్ రూపంలో వచ్చే ఆదాయాన్ని కోత పెట్టుకుని అదే మొత్తం కార్పొరేషన్‌నుంచి వసూలు చేసి.. దాని ఆదాయంగా చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం పరోక్షంగా మరో కార్పొరేషన్‌కు వేరే మార్గంలో మళ్లిస్తున్నారు.
ఇది సబబేనా?: ఈ తీరులో ప్రభుత్వ ఆదాయం మళ్లించడం సబబేనా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై సుంకాలు, లెవీ, మార్జిన్.. ఏదైనా విధించే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. ఇలా వసూలుచేసే ఏ మొత్తమైనా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌లో భాగమవుతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల చట్టం కింద ఏర్పడే కార్పొరేషన్లకు ఇది ఆదాయంగా చూపించడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
* ‘రాజ్యాంగం ప్రకారం ఏడో షెడ్యూలులో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలున్నాయి. ఆయా అంశాల్లో చట్టాలు చేసే అధికారం వాటికే ఉంది. రాష్ట్రంలో ఏ పన్నులైనా విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. మరోవైపు 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు బదలాయించారు. రాజ్యాంగంలోని 11వ షెడ్యూలు ఆర్టికల్ 243 (జి), 243 (హెచ్) ప్రకారం గ్రామీణ స్థానికసంస్థలు కొన్ని పన్నులు విధించి వసూలు చేసుకునే అధికారముంది. పట్టణ స్థానిక సంస్థలకూ ఇలా అధికారముంది. కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లకు అసలు ఇలాంటి అధికారమే లేదు’ అని వారు పేర్కొంటున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌కు నిర్వహణ ఛార్జీలు చెల్లించగలదు. అదికూడా కార్పొరేషన్ కార్యకలాపాలు ఆడిట్ చేశాక మాత్రమే అని వారు విశ్లేషిస్తున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్ ఆదాయంగా చూపించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కు విరుద్ధమని, ఏ ఆదాయమైనా తొలుత కన్సాలిడేటెడ్ ఫండ్‌కు రావాలని ఆర్టికల్ 266 క్లాజు1 చెబుతోందని పేర్కొంటున్నారు.
బ్యాంకులు అంగీకరించేనా?: ఏపీఎస్‌డీసీ వ్యవహారాన్ని కేంద్రం తప్పుపట్టింది. ప్రభుత్వ ఆదాయాన్ని కార్పొరేషన్‌కు మళ్లించి అది వారి ఆదాయంగా చూపించడాన్ని సమర్థించి బ్యాంకులు అప్పులిస్తాయా? అన్నది వేచి చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: RTC-EHS CARDS: ఆర్టీసీ ద్వారా వైద్యం కావాలంటే.. నెల ప్రీమియం ఎంతంటే?