Excise revenue: మద్యం టెండర్ల కోసం వచ్చిన దరఖాస్తులతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 68, 550 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,371 కోట్లు ఆదాయం వచ్చింది.
తెలంగాణలోని 2620 మద్యం దుకాణాలల్లో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయని నవంబర్ 20వ తేదీన డ్రా నిలుపుదల చేశారు. దీనితో ఆ 43 దుకాణాలకు టెండర్ వాయిదా పడింది. వాటి కోసం తిరిగి ఆబ్కారీ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వాటికి 713 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 14.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది.
అత్యధికంగా ఖమ్మంలోనే..
తెలంగాణలోని 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా దాదాపు 68, 550 దరఖాస్తులు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఒక్కో మద్యం దుకాణానికి 25కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు ఏకంగా 6,212 దరఖాస్తులు రావడంతో ఒక్కో మద్యం దుకాణానికి 51 దరఖాస్తులు అందాయి. ఇదే ఖమ్మం జిల్లాలో 2019 -21 ఎక్సైజ్ పాలసీలో ఒక్కో మద్యం దుకానాణానికి 48 దరఖాస్తులు అందినట్లు స్పష్టం చేసింది. అదేవిధంగా కొత్తగూడెం ఎక్సైజ్ జిల్లాకు 88 మద్యం దుకాణాలు ఏకంగా 4 వేల 270 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో మద్యం దుకాణానికి 48 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు 1572 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పెద్దవంగరలోని దుకాణానికి 69, అత్యల్పంగా గంగారంలోని దుకాణానికి 12 దరఖాస్తులు అందాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 230 దుకాణాలకు గానూ 4వేల 700 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ. 94 కోట్ల ఆదాయం సమకూరింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ సర్కిల్లోని 3 దుకాణాలకు అత్యధికంగా 90కి పైగా దరఖాస్తులు రాగా.. అలంపూర్, కల్వకుర్తి సర్కిళ్లలోనే అత్యధికంగా 40కి పైగా దరఖాస్తులు నమోదయ్యాయి.
లక్ష లక్ష్యం చేరలే..
2019-21 మద్యం విధి విధానాల ప్రకారం 2,216 మద్యం షాపులకు 49వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం విధానంలో ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న నిబంధనను తొలగించడంతో పాటు లైసెన్స్ విధానాన్ని సరళీకరణ చేశారు. ఇలా చేయడం వల్ల భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అంచనా వేసింది. ఇప్పుడున్న 2,216 దుకాణాలకు కొత్తగా మరో 404 దుకాణాలు అదనంగా ఏర్పాటు అవుతుండడంతో దాదాపు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు. కానీ.. స్పందన పెద్దగా లేకపోవటం వల్ల లక్ష లక్ష్యం కాస్తా.. 68 వేల దగ్గరే ఆగిపోయింది.
ఇదీ చదవండి: