గ్రామ, వార్డు సచివాలయాలు బలమైన కార్యనిర్వాహక వ్యవస్థలాగా మారి ప్రజలకు పారదర్శక సేవలు అందించే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సచివాలయాలన్నీ సర్పంచ్, పంచాయతీల నేతృత్వంలోనే పనిచేస్తాయని వెల్లడించారు. పాలన వికేంద్రీకరణ కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 34 వేల మందికి ఉద్యోగం కల్పించామని... వీరికి వేతనాలుగా దాదాపు రూ.2,200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. పరిశ్రమల్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే రూ.5 వేల కోట్లు కూడా సరిపోవని అన్నారు.
అంతా పారదర్శకమే
గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 34 వేల ఉద్యోగాలను పూర్తి పారదర్శకంగా భర్తీ చేశామని అజయ కల్లాం స్పష్టం చేశారు. నిజంగా ప్రశ్నపత్రాలు లీక్ అయితే నాలుగు లక్షల మంది వరకూ అర్హత సాధించి ఉండేవారని అన్నారు. ఒకటి రెండు చిన్న పొరపాట్లు ఉంటే ఉండవచ్చని దీనిని అందరికీ ఆపాదించడం సరికాదని తెలిపారు.
రూ.65 వేల కోట్ల అప్పుల భారం
గత ప్రభుత్వం రూ.65వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని కొత్త ప్రభుత్వం నెత్తిన పెట్టిందని... ఇందులో రూ.39 వేల 500 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని అజయ్ కల్లాం వెల్లడించారు. ఈ వంద రోజుల్లోనే రూ.25 వేల కోట్లు క్లియర్ చేశామని వివరించారు. నిధుల కొరత వల్లే కొన్ని పథకాలు వాయిదా వేశామన్న ఆయన... అత్యవసరంగా కొత్త అప్పులు కూడా తెస్తున్నామని అన్నారు.
విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని అజయ్ కల్లాం ఆరోపించారు. సౌర, పవన విద్యుత్ యూనిట్‌కు 4 రూపాయల 84 పైసలు స్థిర ధర చెల్లించేలా పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవడం దురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వీటిని సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
విభజన అంశాలపై చర్చలు కొలిక్కి
ఏపీ భవన్, విద్యుత్ ఉద్యోగుల విభజన వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెచ్చిన నూతన ఇసుక విధానం మంచిదన్న ఆయన... రాయితీలతో పరిశ్రమలు రావని... ఇతర విధానాల ద్వారా కూడా పెట్టుబడులు ఆకర్షించవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: