Godavari floods at bhadrachalam తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఫలితంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం గోదావరికి 14 లక్షల 26 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గోదావరి ఉద్ధృతితో వారం రోజులుగా ముంపు మండలాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే రాత్రికి గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు వాసులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై వరద చేరిన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ హెచ్చరించారు.
నెల కూడా కాలేదు: నెల రోజులు కూడా కాకముందే గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రివాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి మూడు రాష్ట్రాలకు భారీ వాహనాలను వెళ్లనీయడం లేదు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు.
రికార్డ్ స్థాయిలో వరద: గోదావరి చరిత్రలో 1986లో అత్యధికంగా 75.6 అడుగుల స్థాయి మట్టం నమోదయింది. అప్పుడు నదిలో 32.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. గత నెల 16న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గరిష్ఠంగా 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా.. 24.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. ఇలా దాదాపు 17 గంటల పాటు 71 అడుగులపైనే మట్టం కొనసాగింది. ఇప్పుడు ఆ స్థాయిలో ప్రమాదం లేకపోయినా.. ఇప్పటికే వరదతో చితికిన బతుకులు.. మళ్లీ దుర్భర పరిస్థితుల్లోకి జారుకునే పరిస్థితి ఉందని భద్రాద్రి వాసులు ఆందోళన చెందుతున్నారు. కరకట్ట పటిష్టతపై ఇటీవల ఆందోళనలు వ్యక్తం కావడం స్థానికుల భయాన్ని మరింత పెంచుతోంది.
ఇవీ చూడండి..