"పెళ్లి కాని జంటలకు పార్కులోకి అనుమతి లేదు". ఈ బోర్డు చూసినవారు ఎవరైనా.. మరోసారి చదువుకోకమానరు. బయటవస్తువులు, పెంపుడు జంతువులు, ప్లాస్టిక్ బాటిళ్లు లోనికి తీసుకురావొద్దనే నిబంధన చూశాము కాని.. ఇలా పెళ్లికాని వాళ్లను పార్కులోకి రావొద్దనమేంటని అనుకోకమానరు. అవును పార్కులోకి వెళ్లిన యువతీయువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని నియంత్రించడానికి ఇందిరాపార్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ విషయమేమిటంటే..
హైదరాబాద్లోని దోమలగూడలో ఉన్న ఇందిరాపార్కు సందర్శకులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. వారాంతాలతో పాటు ప్రత్యేక రోజుల్లోను రద్దీగా ఉంటుంది. అయితే గతంలో ఈ పార్కులోకి అందరికీ అనుమతి ఉండేది. కానీ పార్కులోకి వెల్లిన కొందరు యువతీయువకులు హద్దుమీరి ప్రవర్తించడం వల్ల... మిగిలినవారు ఇబ్బందిపడేవారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం పెళ్లికాని జంటలను పార్కులోనికి అనుమతించమని పార్కు యాజమాన్యం బోర్డులు ఏర్పాటు చేసింది.
నిబంధనలు జేబు నింపుకోడానికా...
పార్కులోనికి అవివాహితులను అనుమతించినప్పటి నుంచి సందర్శనకు వచ్చిన వారిని రకరకాల ప్రశ్నలతో పార్కు సిబ్బంది ఇబ్బంది పెట్టడం... వారికి ఎంతో కొంత ఇవ్వగానే లోనికి అనుమతించడం షరా మామూలైపోయింది. దీనికి తోడు ఈ బోర్డుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడం వల్ల జీహెచ్ఎంసీ, ఇందిరాపార్కు అధికారులు గురువారం రాత్రి ఆ బోర్డును తొలగించారు.
ఇందిరా పార్క్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు తీసివేయడం వల్ల సందర్శకుల తాకిడి మళ్లీ పెరిగింది. మొత్తానికి పార్కు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మాత్రం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి:
RAHUL MURDER CASE: 'వ్యాపార లావాదేవీల్లో వివాదాలే రాహుల్ హత్యకు కారణం'