తెలంగాణ రాష్ట్రంలో పాస్‌పోర్టు(passport) సేవా కేంద్రాల్లో నేటి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించనున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు వందశాతం అపాయింట్‌మెంట్లు ఇస్తాయని వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌక్, నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాలు పని చేస్తున్నా.. కేవలం యాభైశాతం అపాయింట్‌మెంట్లు మాత్రమే ఇచ్చేవని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పని చేస్తాయని వివరించారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, వికారాబాద్, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డిలోని సేవాకేంద్రాల్లో ఈ నెల 10 నుంచి సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన విరమణ