మూడు ముక్కలాట వద్దు.. అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్న ప్రకటనే తమకు నిజమైన పండగంటూ భోగి, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రైతులు...కనుమ రోజూ దీక్షా శిబిరాల్లోనే గడపనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది . సంక్రాంతి పండగకు సైతం జరుపుకోకుండా రైతులు ఉపవాస దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రాజధాని గ్రామాలను పర్యటించారు . రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అమరావతి సాధనే ప్రతి ఒక్కరి ఊపిరి కావాలని పిలుపునిచ్చారు .
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఉద్యమం చేస్తామని మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి అన్నారు . రాజధాని కోసం అందరూ యుద్దానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు . అమరావతి ప్రాంతానికి చరిత్రలో ప్రాముఖ్యత ఉందని ఆత్యాధ్మిక వేత్త డా.కొండవీటి జ్యోతీర్మయి అన్నారు . అమరావతిలో రాజధాని నిర్మిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవుపలికారు.
సంతకాలు తీసుకునే పనిలో పోలీసులు..
రాజధాని గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు .రైతులను తాము వేధించలేదని ,వారిని ఈడ్చుకెళ్లలేదని పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రైతుల వద్ద సంతకాలు తీసుకునే ప్రయత్నం చేశారు . పోలీసుల చర్యలతో రైతులు విభేదించారు . హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు . ఇప్పటికే రైతులు,ఐకాస నేతలు డీజీపీని కలిసి తమ సమస్యలను వివరించారు . ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసు బలగాలు తగ్గించారు .
సీపీఐ నేతల పర్యటన..
ఈరోజు సీపీఐపార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణ , రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తో పాటు పలువురు నేతలు పెనుమాక,నవ్వులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం,మందడం,వెలగపూడి ,తుళ్లూరు, తాడికొండ గ్రామాల్లో పర్యటించనున్నారు . రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు . నేడు కూడా కనుమ పండగకు దూరంగా ఉండి రైతులు ఉద్యమం చేయనున్నారు .
ఇదీ చదవండి : ఇక పాస్పోర్టు పొందడం మరింత సులభం